హైదరాబాద్, జనవరి 31, 2026: TGOS KEY DECISIONS ON PENDING BILLS AND OLD PENSION. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (TGOS) కీలక సమావేశం శనివారం నాడు ములుగు జిల్లా ZPP మీటింగ్ హాల్‌లో ఘనంగా జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వానికి చేయాల్సిన డిమాండ్లపై పలు కీలక తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
TGOS KEY DECISIONS ON PENDING BILLS AND OLD PENSION.
ప్రధాన డిమాండ్లు మరియు తీర్మానాలు:
ఈ సమావేశంలో చర్చించిన 7 ప్రధానాంశాలు ఇవే:
- పెండింగ్ బిల్లుల నిధుల పెంపు: ప్రస్తుతం ప్రతి నెలా విడుదల చేస్తున్న రూ. 700 కోట్ల నిధులను రూ. 1500 కోట్లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తద్వారా ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను ఒకే విడతలో చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
- DA విడుదల: పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను (01-01-2024, 01-07-2024, 01-01-2025, 01-07-2025) తక్షణమే విడుదల చేయాలని కోరారు.
- 2వ PRC అమలు: 01-07-2023 నుండి పెండింగ్‌లో ఉన్న PRC రిపోర్ట్‌ను తెప్పించుకుని, 42% ఫిట్‌మెంట్‌తో రెండవ పి.ఆర్.సి.ని వెంటనే అమలు చేయాలని తీర్మానించారు.
- పాత పెన్షన్ స్కీమ్ (OPS): రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని గట్టిగా డిమాండ్ చేశారు.
- ఆరోగ్య పథకం (EHS): ఉద్యోగులు, ప్రభుత్వం సమాన నిష్పత్తిలో కంట్రిబ్యూషన్ చేసే విధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కోరారు.
- అద్దె వాహనాల బకాయిలు: వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అద్దె వాహనాల బకాయిలను క్లియర్ చేయడంతో పాటు, 2012లో నిర్ణయించిన రూ. 34 వేల అద్దెను డీజిల్ ధరల పెంపు దృష్ట్యా రూ. 50 వేలకు పెంచాలని తీర్మానించారు.
- భూ కేటాయింపులు – కృతజ్ఞతలు: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు టీజీఓ కేంద్ర సంఘానికి, జిల్లా కేంద్రాలకు భూ కేటాయింపులు చేస్తామని, భవన నిర్మాణాలకు 50% మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించినందుకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది.

