TGO NEWS (DEC. 31) : TGO LEADER SATYA NARAYANA SUPERANNUATION – SPECIAL ESSAY BY VENKATKISHAN ETYALA.
తెలంగాణ గ్రామీణ సమాజం నుంచి ప్రభుత్వ యంత్రాంగం వరకు, ఉద్యమ నాయకత్వం దాకా సాగిన ఒక అసాధారణ జీవన ప్రయాణానికి ప్రతిరూపమే ఏనుగుల సత్యనారాయణ.
వ్యక్తిగత పోరాటాలు, సామాజిక ఒడిదుడుకులు మధ్య నిలబడి, చదువు అనే గడ్డి పోచ సాయంతో చివరికి ఉద్యోగ సంఘ నాయకత్వంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా ఆయన జీవితం నిలుస్తుంది.
జగిత్యాల జిల్లాలో ఎక్సైజ్ సూపరింటెండ్ గా పని చేస్తున్న ఏనుగుల సత్యనారాయణ, 1965 జనవరి 3 న, మెదక్ జిల్లాలోని, చిన్న శంకరంపేట మండలం, గజగట్లపల్లె గ్రామంలో ఏనుగుల రంగయ్య పటేల్, భూలక్ష్మి దంపతులకు జన్మించారు. ఊరి పేరులో కూడా ఇంటి పేరు ( ఏనుగుల ). తల్లి తండ్రులు వ్యవసాయం చేసుకొని బ్రతికే కుటుంబం. వాళ్ల కాందాన్ మాలి పటేల్ కుటుంబం కావడం వల్ల వీళ్ళకి 12 ఎకరాలు భూమి ఉండేది. మాలి పటేల్ తనం తమ చిన్న తాత వాళ్ల కి పోయింది. ఇద్దరు అక్క చెల్లెండ్లు. అక్క వెంకట లక్ష్మి , చెల్లెలు మంగ కుటుంబ బాధ్యతల మధ్యే పెరిగారు.
. ఒకప్పుడు 12 ఎకరాల భూమి ఉన్నా, భూసంబంధ వివాదాలు, కుటుంబ విభేదాల కారణంగా ఆ స్థిరత్వం చెదిరిపోయింది. రంగయ్య పటేల్ కొంచెం ఖచ్చితమైన మనిషి. ఎవరైనా ఒక మాట అన్న పడడు. సత్యనారాయణకి నాలుగు ఏండ్లు వయసు ఉన్నపుడు, తమ పెద్ద బాపు వాళ్లతో లొల్లి ఐతే గొడవలో భాగంగా వాళ్ళు వీళ్ళింట్లోకి వచ్చి మన్నుపోస్తే ఇక ఆ ఇంట్లో ఉండను అని రంగయ్య పటేల్ ఊరు విడిచిపోయి తొగిట గ్రామంలో నాలుగు ఎకరాలు భూమి కొన్నాడు. కానీ అక్కడ కూడా ఉండలేక నిజామాబాద్ పట్టణ జెండా గద్దెకి వలసబోయింది కుటుంబం. అక్కడ పాలుకు/ కౌలుకి వ్యవసాయం చేస్తూ ఒక రెండు ఎకరాలు సంపాదించారు. తర్వాత కాలంలో ఆ భూమిని అమ్మి అక్క చెల్లెండ్ల పెళ్లి చేసినారు. పెద్ద బావ వ్యవసాయం , చిన్న బావ పోస్ట్ మాస్టర్ గా పని చేస్తూ వ్యవసాయం చేసుకునేవారు.
విద్యా ఆరంభం – అశాంత బాల్యం
తొగిట గ్రామంలో ఉన్న కొద్ది రోజులలో సత్యనారాయణని బడికి పంపే పరిస్థితులు లేకుండే. దాంతో అమ్మమ్మ ఊరైన సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ తాలూకా దొంతి పక్కన ఉన్న పోతారo ఊరికి పంపించబడ్డాడు. తాతయ్య ఆ ఊరిలో పట్వారీ వతన్దార్. తల్లితండ్రులు ఒక చోట, అక్క చెల్లెండ్లకు దూరం, కుటుంబం లో స్థిరత్వం లేకపోవడం ఆ చిన్నారి మనసులో ఒక ఒంటరితనాన్నినింపింది. ఊరు , పేరు , కుటుంబం గురించి అడిగే సమాజానికి ఏం చెప్పాలో తెలియని వయసులో ఒక సందిగ్దత నెలకొన్నది ఆలోచనల్లో. పోతారం లో ఉన్న రెండు సంవత్సరాలు ఒకటో తరగతి పట్టినా కాని " ఉ , ఊ " అనే రెండు తెలుగు అక్షరాలు రాయలేక ఇబ్బంది పడడం తో తాతయ్య బడి మానిపించి తన మేన మామ తో కలిపి ఇంట్లో ఉన్న గొడ్లు గొర్లు మేపడానికి పంపారు.ఊరికి వచ్చిన బాపు రంగయ్య పటేల్ ఇది చూసి తన వెంట నిజామాబాద్ తీసుకెళ్ళిoడు.
అది 1969 - 70 కాలం. ప్రపంచవ్యాప్తంగా హంగ్రీ సిక్టీస్ అని చెప్పబడుతున్న కాలం. దేశంలో వసంత మేఘ గర్జన పిలుపులు. తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ నినాదాలు.
ఎటు పాలు పోని గ్రామీణ వాతావరణoలో..., ఆందోళనలు , గొడవలు. నిజామాబాద్ లో కూడా బడికి వెళ్ళక రెండు సంవత్సరాలు వృధా అయ్యాయి. అటు బడికి పోలేక ఇటు పని చేసే వయసు లేక మరింత ఒంటరిగా ఉండిపోయి మనసులో ఒక అరాచకమైన పరిస్థితి నెలకొన్నది. అదే సమయంలో సృజనాత్మకత పెరిగింది . ఇంటి వద్ద అందుబాటులో ఉండే వస్తువులతో రకరకాల బొమ్మలు, ఆటలు ఆడేవాడు.ప్రయోగాలు చేసేవాడు. కానీ మొండిగా తయారయ్యాడు. అందువల్ల బాపు రంగయ్య పటేల్ ఒక ఆలోచనతో పది ఏండ్ల వయసు ప్రకారం డైరెక్ట్ అయిదో తరగతి లో “ శంకర్ భవన్ , ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ చేసిండు.క్రమశిక్షణ లేని , ఒక చోట పొందికగా ఉండలేని పిల్లాడు గా ఉన్నప్పటికీ , చురుకైన బ్రెయిన్ , ఒకసారి చదివితే వింటే జీవితంలో మరచిపోని జ్ఞాపక శక్తి సత్యనారాయణ సొంతం. తరగతిలో సైన్సు టీచర్ హైడ్రోజెన్ తయారు విధానం గురించి చెప్పితే , తన సొంత తెలివితో లో సైన్స్ ప్రయోగముగా ఖాళీ బీర్ సీసాలో నీళ్ళు, పాన్ దాన్ లో వాడే సున్నం, టాబ్లెట్ పైన ఉండే కవర్ ని తీసి జింక్ గా వాడి , గాలి బుగ్గని బీర్ సీస మూతికి కట్టి కదిలించితే చర్య జరిగి హైడ్రోజెన్ తయారై గాలి బుగ్గ పైకి లేచిది. ఆది చూసి స్కూల్ అంత మెచ్పచుకుంటే జీవితంలో మొదటిసారి సమాజం పట్ల ఒక సానుకూల దృక్పథం ఏర్పడింది. అక్కడే ఒక భావన పుట్టింది: “చదువు నా ఆయుధం కావచ్చు”
కౌమార దశ – ఆవారతనం, ఆలోచనల సంఘర్షణ
ఏడో తరగతి పూర్తి అయ్యాక ” ప్రభుత్వ జూనియర్ కాలేజి , ఖిలా నిజామాబాద్ “ లో చేరిండు. ఆ విద్యా సంస్థలో ఉదయం గo . 8.30 ని. నుండి మధ్యాహ్నం 1 వరకు హై స్కూల్ తరగతులు , మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకి ఇంటర్ వరకి క్లాసులు నడిచేవి. ఐతే చురుకైన విద్యార్ధి అయిన సత్యనారాయణ కి క్లాసుల్లో చెప్పే చదువులు సరిపోయినట్లు అనిపించకపోయేవి. దాంతో బడికి తప్పించి ఇంటి వద్దనే పుస్తకాలు అన్ని ముందట వేసుకొని తరగతి ప్రారంభపు మొదటి రోజుల్లోనే మొత్తం పాఠాలు చదివేవాడు. దానితో ఇక స్కూల్ కి వెళ్ళేవాడు కాదు. కాని ఇంట్లో ఒత్తిడికి పుస్తకాల సంచితో ఉదయం గo . 8.30 ని కి బయల్దేరి పోయి స్థానిక లైబ్రరి లో కూర్చునే వాడు. అక్కడ తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు మొత్తం చదివేవాడు. 10 గంటలకి మాణిక్ భవన్ ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళే పిల్లలు, స్కూల్ కి తప్పించి పేక ఆడుతుండే గ్యాంగ్ తో పరిచయం అయింది. తప్పుడు స్నేహాలు. ఆ ఆవారా పిల్లలతో సోపతి అయి జువ్వ ( మట్కా ప్లస్ పేక ) ఆటకి అలావాటు పడ్డడు. ఆ ఆవారతనంతో స్కూల్ రాజకీయాల్లో చేరి తను చెప్పిన వ్యక్తికే క్లాస్ రేప్రేజేంటేటివ్ , హై స్కూల్ సెక్షన్ కి జనరల్ సెక్రెటరీ , కాలేజి కి ప్రెసిడెంట్ పోస్ట్ ఉండేది. తను జెనెరల్ సెక్రటరీ పోస్ట్ కోసం తన వర్గపు వ్యక్తీ కోసం కష్టపడేవాడు. ఆ గొడవలు అన్ని వచ్చి ఇంటికి చేరేవి. బడికి సరిగా వెళ్లకపోవడం , లైబ్రరీ లో ప్రపంచాన్ని చదువడం ,ఇంగ్లీష్ భాషపై పట్టు, బయట జువ్వ ఆడుతూ లోకాన్ని తెలుసుకోవడం , అనేక ప్రమాదాల్లో ఇరుక్కుపోవడం ఇంటి చుట్టూ గొడవలు... , మాట వినకుంట అయిన కొడుకుతో బాపు మాటలు బంద్ చేసిండు. కనీసం ఇంటికి వస్తే చూడడానికి కూడా ఇష్ట పడక పోయేది. తల్లి మాత్రం పట్టుకొని ఏడ్చేది.
ఏదోలా ఇంటర్మీడియట్ పూర్తి కావడానికి వచ్చింది. యవ్వనపు దుడుకుతనం , తనకి తెలియకుండానే ఒక రకమైన చక్రబందంలో చిక్కుకుపోయిన సత్యనారాయణకి తండ్రి నిరాదరణ , సమాజపు సవాళ్లు , గొడవలు , కొట్లాటలు ఒక నిర్వేదం లోకి , ఒత్తిడి లోకి తీసుకెళ్ళాయి. కే ఏ వ్యాస్ నిజామాబాద్ ఎస్పీ గా వచ్చాక మట్కా , పేక ఆటలపై ఉక్కు పాదం మోపిండు. ఏ పూటకి ఇంటికి వచ్చిన తిండి పెట్టి ప్రేమ చూపే తల్లి ఉన్నప్పటికీ , సరైన కౌన్సెలింగ్ , ఆదరణ లేని తనంతో మరింత గుర్తింపులేనితనం, సమాజంలో నిలబడలేని సమస్య వచ్చి పడింది. తండ్రితో సర్దుబాటు కాలేకపోతుండు.ఇది 1980ల చివరి కాలం – గ్రామీణ యువతకు మార్గదర్శనం లేని దశ. ఉపాధి అవకాశాలు తక్కువ, కౌన్సెలింగ్ అనే భావనే తెలియని సమాజం.
ఎండాకాలం సెలవులు – బొంబాయికి పారిపోవడం
ఒక రోజు ఇంట్లో అమ్మ దాచుకున్న 140 రూపాయలు తీసుకుని మహారాష్ట్ర బోర్డర్ పారిపోయి నాందేడ్ జిల్లా ధర్మాబాద్ లో మట్కా ఆడిండు. లాభంతో కలిపి 700 రూపాయలు చేతిలో ఉన్నాయి. తన లాగే అక్కడికి ఆడడానికి వచ్చిన తన ఊరి పెద్ద వాళ్ళు చూడడంతో ఇక ఇంటికి వెళ్తే లాభం లేదు అనుకోని రైలు బండి ఎక్కి పూర్ణకి వెళ్లి అక్కడ టిఫిను చేసిన తరువాత మల్లి ఎటు పోవాలో తోచక ఆలోచిస్తుంటే పూణే వెళ్ళే రైలు వస్తే ఎక్కి పూణే చేరిండు. ఎక్కడికి వెళ్ళినా బగార్ టికెట్ . పూణే లో దిగి అమితాబ్ బచ్చన్ “ సత్తే పే సత్తా “ సినిమా చూసిండు. ఆ రాత్రి రైల్వే స్టేషన్ లో పడుకొని ఒక డ్రెస్ , తువ్వాల , చేతి సంచి కొనుక్కున్నాడు. ఒక రోజు అంతా ఉండి ఏమి తోచక బొంబాయి పోయే రైలు ఎక్కిండు. బొంబాయి విఎస్టి స్టేషన్ లో దిగి చుట్టూ చూసి వడపావు తిని దగ్గరి పార్క్ లో కూసున్నాడు. ఏమీ తోచక బయటకు వచ్చి మల్లొక వడపావు తిని వచ్చి పార్క్ లోనే అటు ఇటూ తిరుగుతూ ఉంటే చూసి వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి తో ఇలా సంభాషణ కొనసాగింది.
” ఘర్ సే బాగ్ గయా హై క్యా ? “
“ హా “
” కొంసా గావ్ ? “
“ హైదరాబాద్ “
“ మద్రాసి ? “
“ నహి నహి హైదరాబాద్ “
“ వొయీ మద్రాసి “
“ కహా తక్ పడే ? “
“ ఇంటర్మీడియట్ “
“ సమజ్ నహి ముజే “
“ దశ్వి కక్షా అవుర్ ఉస్కే ఊపర్ మే దో “
” అచ్చా పడే . కామ్ కర్తే క్యా ? “
“ హా కర్తా “
అలా ఆ వ్యక్తి తీసుకపోయి దగ్గరలో ఉన్న బస్తిలోని పహిల్వాన్ దగ్గరికి తీసుకుపోయిండు. గీతల చెడ్డి మీద లొడాసు బనీన్ వేసుకుని లావుగా కండలు తిరిగి మంచం లో పడుకుని ఉన్న ఆ పహిల్వాన్ చుట్టూ 30 మంది గుండాలు నిలబడి ఉన్నారు. అందులో ఒక ముగ్గురు బాడీ మసాజ్ చేస్తున్నరు. అతని ముందుకి పోయి నిలబడగానే పక్కకి లేచి సత్యనారాయణ కాళ్ళ దగ్గర పడేలా ఎర్రటి పాన్ మసాల ఊంచిండు. ఆ పహిల్వాన్ ఆ మొహల్ల ( బస్తీ ) కి పెద్ద . అందరి దగ్గర తన దగ్గర పని చేసే గుండాలతో హఫ్తా వసూలు చేయించుకుంటాడు. అతన్ని చూసిన సత్యనారాయణకి భయం అయినది.
“ యే చోరా క్యా కాం కర్తా ? “
“ పడే లేకె బచ్చా. ఆప్కా ఇసబ్ దేఖ్ లేంగా “
పని కుదిరింది.
పహిల్వాన్ పది పావు బజ్జీ బండ్లు వసూలు లెక్క రోజు పోయి రాయాలి . సత్యనారాయణ రాస్తే ఇంకొకడు పైసలు వసూలు చేస్తాడు. అలా చేస్తే రోజు వడపావు , రొట్టెలు, సముద్ర చేపల తిండి. అన్నం లేదు. రోజు ఒకే తిండి. ఆ సముద్ర చేపల వాసన భరించలేక పోయాడు. లెక్క పుక్తా పని చూసి మంచి జీతం ఇస్తా నీకు అన్నాడు పహిల్వాన్. . కాని ఆ తిండి తినలేక 10 రోజులు అయ్యాక ఆరు బీర్లు తెమ్మని పహిల్వాన్ ఇచ్చిన 100 రూపాయలు పట్టుకుని వీఎస్టి రైల్వే స్టేషన్ లో లోకల్ ట్రైన్ ఎక్కి బొంబాయి సెంట్రల్ స్టేషన్ కి పోయిoడు. స్టేషన్ లో ఒక లాటరి టికెట్ కూడా కొన్నాడు. బగార్ టికెట్ తో టికెట్ కలెక్టర్ కి దొరికినందుకు పైసల కోసం చెక్ చేస్తే నడుము చుట్టూ పట్టీలో దాచుకున్న డబ్బులు దొరకలేదు కానీ లాటరి టికెట్ గుంజుకున్నాడు ఆ టిసి. బొంబాయి లో దిగిండు. అక్కడి నుండి మినార్ ఎక్ష్ప్రెస్ ఎక్కి వచ్చి హైదరాబాద్ లో దిగిండు.
. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో తెలిసిన ఫ్రెండ్ నాగరాజు ను కలిసి ఒక టైలరింగ్ పని చేసే వ్యక్తీ దగ్గర ఉన్నాడు ఒక నెల రోజులు. ఎక్కడ ఉన్న పేపర్ చదివే అలవాటు మాత్రం తప్పడు కాబట్టి ఒక రోజు పేపర్ లో రేపే ఇంటర్మీడియట్ రిజల్ట్ అని వచ్చింది. అప్పటికి ఇంకా స్పెషల్ జిల్లా ఎడిషన్ లు రాలేదు. కాబట్టి సిబిఎస్ బస్సు స్టాండ్ కి పొద్దున్నేవెళ్లి నిజామాబాద్ నుండి ఎవరైనా పేపర్ పట్టుకొని దిగుతారా అని ఎదురు చూసి , ఒకరిని అడిగి రిజల్ట్ చూసుకుంటే తను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిండు. వెంటనే జనరల్ పోస్ట్ ఆఫీస్ , అబిడ్స్ కి వెళ్లి ఇన్ లాండ్ లెటర్ ఇంటికి రాసిండు.నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, నా సెర్టిఫికేట్స్ వెంటనే నేను కింద ఇచ్చిన అడ్రెస్ కి రాగలరు అని. చచ్చిపోయిoడు అనుకున్నఒక్కాగానొక్క కొడుకు బతికే ఉన్నాడు అనే సంబరం తల్లితండ్రులకి. తల్లీ అప్పాలు చేసి మూట కట్టి కొడుకుకి భర్తతో పంపింది. తండ్రి హైదరాబాద్ లో తనకి తెలిసిన అమీర్ పెట్ లో ఉండే రంజిత్ సింగ్ ని కలిసి తన అడ్రెస్ దగ్గరికి వచ్చిండు.
” ఇంటికి రా, నిజామాబాద్ లోనే చదువు డిగ్రీ. “ తండ్రి
“ లేదు రాను. ఇక్కడే చదువుకుంటా. “
“ ఇక్కడ చదివితే నేను ఒక్క రూపాయి పంపను “
“ ఇవ్వకున్న సరే నేను అక్కడే చదువుకుంటా . “
. ఏవి ( ఆంధ్రా విద్యాలయ ) కాలేజి , నిజాం కాలేజి రెండింట్లో బిఎస్సీ ( బిజేడ్సి ) సీట్ కోసం అప్లై చేసిండు. రెండింట్లో సీట్ వచ్చింది. కాని నిజాం కాలేజిలో అటెండెన్స్ అడుగుతారు అని ఏవీ కాలేజిలో జాయిన్ అయిండు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏవీ కాలేజి విద్యార్థి నే.
బతకడం కోసం ఫ్రెండ్ నాగరాజు తో కలిసి సుల్తాన్ బజార్ లో లేడీస్ ఎంపోరియం సామాను రిబ్బనులు, పిన్నులు, బొట్టులు , పౌడర్ డబ్బాలు తిరుగుతూ అమ్మేవారు.కాలేజికి పోయేది లేదు. పరీక్ష ఫీజు వివరాల కోసం కాలేజికి వెళ్లి క్లర్క్ ని మంచితనం చేసుకొని అడుగుడు , ఆ రోజు లిబర్టీ చౌరస్తా లోని మొఘల్ దర్బార్ లో బిర్యాని తినుడు. ఫీజు కట్టుడు కాని పరీక్ష రాసుడు లేదు.
అమ్మ మరణం – పరివర్తన
ఇంతలో పిడుగు లాంటి విషయం సత్యనారాయణ జీవితాన్ని కుదిపివేసింది. తనకి బాధ కలిగితే ఈ ప్రపంచం లో ఏ వ్యక్తిని ఐతే గుర్తు చేసుకొని సాంత్వన పొందుతాడో ... ఆమె తన తల్లి అనారోగ్యం తో హైదరాబాద్ గాంధి హాస్పిటల్ కి వచ్చి చనిపోయింది. చనిపోయే దాక తనకి తెలియదు.తన తల్లి గారిని ఆమె సొంత ఊరు పోతారాo లో దహనం చేసినారు.
అమ్మ మరణం తీవ్రమైన ఆలోచనకి గురి చేసింది. కాని అప్పటికే తన చేతిలో ఏమి లేదు. నెల రోజుల్లో డిగ్రీ ఫైనల్ పరీక్షలు. ప్రాక్టికల్స్ పరీక్షలకి ల్యాబ్ ఎక్కడో తనకి తెలియదు. ఏతులకి తీసుకున్న ఇంగ్లీష్ మీడియం చదువు. పొద్దున్న మధ్యాహ్నం మొదటి మరియు మూడో సంవత్సర పరీక్షలు , తెల్లారి రెండో సంవత్సరం పరీక్షలు. ఎలాగోలా ఎగ్జామ్స్ రాసి అప్పటికే ఉన్న రెండు ఎకరాల భూమి అక్క చెల్లెండ్ల పెళ్లి చేసి ఒంటరిగా ఉన్న తండ్రి కోసం నిజామాబాద్ కి తిరిగి వచ్చిండు సత్యనారాయణ.
1987 లో ఫెయిల్ అవుతా అనుకున్న డిగ్రీ 58% తో పాస్. ఐన కాని ఊళ్ళో ఉండి కూరగాయల వలే కాకుండా పాడు కాని అల్లం.ఎల్లిగడ్డ , ఉల్లిగడ్డ ఆలుగడ్డలు అమ్ముకొని బతుకాలి అనుకున్నాడు. ఇంతలో ఎవరో ఫ్రెండ్స్ బి.ఎడ్. రాస్తే లైఫ్ సెటిల్ అవుతది అనడంతో రాస్తే మహబూబ్ నగర్ బీఈడీ కాలేజీ లో ఫ్రీ సీట్ వచ్చింది. కేవలం 160 రూపాయలు కట్టాలి. కాని హైదరాబద్ లో చదవాలని కోరుకుని 1500 ఫీజు కట్టి “ నవభారత్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ “ రామంతపూర్ చదివిండు. ప్రస్తుతం ఆ కాలేజి బొల్లారం లో ఉంది. బతుకుదెరువు కోసం బి ఎడ్ చేస్తూనే శాలివాహన పబ్లిక్ స్కూల్ , బహదూర్ గూడలో పార్ట్ టైం టీచరు గా చేస్తూ బి ఎడ్ పూర్తి చేసిండు. 1989 డి ఎస్సీ లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం.
. 1990 లో మెట్పల్లి కి చెందిన నునుగొండ సునీత తో వివాహం జరిగింది. ఇది తన జీవితంలో మరో కీలక మలుపు. తల్లి లేని తనకి తల్లి లా సునీత సహచర్యం. కామారెడ్టీ దగ్గరి ఒక ఊరిలో టీచరు జాబు. రోజు ట్రైన్ లో నిజామాబాద్ నుండి ప్రయాణం. చంద్ర కిరణ్ రెడ్డి అనే స్కూల్ ఫ్రెండ్ కూడా టీచర్ జాబు చేస్తూ ట్రైన్ లో వస్తుంటే వాళ్లు కాంపిటీటివ్ పరీక్షల గురించి చర్చించేవారు. వారి చేతుల్లో కాంపిటీటివ్ సక్సెస్ రివ్యూ లాంటి మేగజీన్స్ ఉండేవి.వాటిని వాళ్ళు చదివి డిస్కస్ చేసేవారు. ఆ చర్చల్లో సత్యనారాయణ కి వాళ్ళ కంటే ఎక్కువ విషయాలు తెలిసేవి. దానితో పాటు ఇంటి వద్ద తండ్రి ఇంత కన్నా పెద్ద నౌకరి , నువ్వు ఎమ్మార్వో వి కావాలి అనేవాడు. దానితో ఎలాగైనా గ్రూప్స్ రాయాలి అని అనుకున్నాడు.
. 1993 లో వచ్చిన గ్రూప్ వన్ , టు పరీక్షలు రాస్తే వన్ లో మెయిన్స్ లో 614 మార్కులు వచ్చినయి. 650 కి ఇంటర్వ్యూ.గ్రూప్ 2 కూడా రాలేదు. 1995 లో గ్రూప్ 2 బి లో సీనియర్ అసిస్టెంట్ జాబు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వచ్చింది. ఒక సంవత్సరం చేసిండు. అప్పుడు వుమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఎల్డీసి గా పని చేసే పరిచయం అయిన సుధాకర్ అనే ఫ్రెండ్ కలిసి ప్రిపేర్ ఐతే ఇద్దరికీ 1995 లో ముందే వచ్చిన స్పెషల్ నోటిఫికేషన్ లో సక్సెస్ అయి 1996 లో ఎక్షైజు ఎస్సై గా సెలెక్ట్ అయినారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం కొనసాగుతున్న కాలం. కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా చాలా అధికారాలు ఉన్న కాలం. కాబట్టి ఆ ఉద్యోగం నచ్చింది.
తెలంగాణ ఉద్యమo – ఉద్యోగ సంఘ నాయకత్వం
2001 లో తెలంగాణా మూవ్మెంట్ సమయములో కే సి ఆర్ కిం కాంటాక్ట్ లోకి వెళ్ళిండు సత్యనారాయణ. ఉద్యమ సమయoలో “ తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్స్” ( టి జి వో ) సంఘం ఏర్పడినపుడు వి. శ్రీనివాస్ గౌడ్ ప్రెసిడెంట్ గా , ఎక్ష్సైజు డిపార్ట్మెంట్ కి చెందిన దశరథ రావు జనరల్ సెక్రెటరీ గాఉండేది. శ్రీనివాస్ గౌడ్, దశరథ రావు , మరో నాయకుడు చంద్రయ్య ల ప్రోత్సాహముతో 2007 లో , సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ గ చేస్తున్నపుడు టి జి వో లో చేరిండు.సంఘం లో క్రీయాశీలక పాత్ర పోషిస్తూ 2009 లో కోశాధికారిగా ఎన్నికైండు. 2014 లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు శ్రీనివాస్ గౌడ్ రాజకీయాల్లోకి పోవడంతో మమత ప్రెసిడెంట్, సత్యనారాయణ జనరల్ సెక్రెటరీగా పన్నెండేళ్లు నిరాటంక సేవ.
ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వంతో చర్చలు, ఉద్యమ స్పూర్తి – ఇవన్నీ ఆయన నాయకత్వానికి గుర్తింపునిచ్చాయి. యూనిఫాం సర్వీస్ లో ఉండి కూడా నిర్భయంగా పని చేసిoడు. అనవసర సమయాల్లో హుందాగా ఉన్నాడు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన ” తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ( టీజీవో ) ” వ్యవస్థాపక నాయకుడిగా ఉండి, సుదీర్ఘ కాలం ఆ సంఘానికి నాలుగు సంవత్సరాలు కోశాధికారిగా, పన్నెండు సంవత్సరాలు ప్రధాన కార్యదర్శి గా , తెలంగాణ ఉద్యోగ జే ఏ సి కి డిప్యూటీ సెక్రటరీ జెనరల్ గా పని చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తో పాటు, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఏనుగుల సత్యనారాయణ చేసిన పోరాటం, కృషి రాష్ట్ర చరిత్రలో అనుపమానమైనది అని రాష్ట్ర ఉద్యోగ జే ఏ సి నాయకత్వం భావిస్తుంది.
," టి జీ వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా , టిజీ జే ఏ సి డిప్యూటీ సెక్రటరీ జెనరల్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూనే చేస్తూనే టి జి వో , టి ఎన్ జీ వో మధ్య ఏర్పడే విబేధాలను ఎప్పటికప్పుడు తీర్చుతూ టి జే ఏ సి నాయకత్వంని సమన్వయపరుస్తూ తను నిర్వహించిన పాత్ర ఎవరు తీర్చలేనిది " - టి ఎన్ జీ వో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర జే ఏ సి చైర్మన్ మారం జగదీశ్వర్
" ఉద్యోగుల సమస్యల గురించి ధైర్యంగా రాష్ట్ర ప్రభుత్వం తో కొట్లాడి, ఉద్యోగులకి పీఆర్ సీ, డి ఏ ఇతర బెనిఫిట్స్ అందించడంలో అతని సేవలు టి జీ వో నాయకత్వం భర్తీ చేసుకో లేనిది " టి జీ వో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, జే ఏ సీ కో చైర్మన్ ఏలూరి శ్రీనివాస రావు.
ముగింపు – ఓ ప్రశాంత మలుపు
నేడు ఎక్సైజ్ సూపరింటెండ్‌గా పదవీ విరమణ చేస్తున్న సత్యనారాయణ జీవితం చూస్తే…,
ఆవార బాల్యం నుంచి సంఘ నాయకత్వం వరకు – ఇది కేవలం వ్యక్తిగత కథ కాదు.
తెలంగాణ గ్రామీణ సమాజంలో అవకాశాలు, అవరోధాలు, ఉద్యమాలు ఎలా ఒక వ్యక్తిని మలుస్తాయో చెప్పే జీవన పాఠం.ఎక్ష్సైజ్ ఎస్సై కి ముందు జీవితంలో అనూహ్య మలుపులు. ఆ తర్వాత స్థిర జీవనం. ఉద్యోగిగా, ఉద్యోగ సంఘం నేత గా మచ్చ లేని మనిషిగా ఈ కాలంలో నిలబడడం ఒక అరుదైన విషయం. రిటైర్మెంట్ తర్వాత ఏంటో వేచి చూడాలి
అది ఇంకా అతని నుండి సాగవల్సిన ప్రయాణం రాయాల్సిన అధ్యాయం.
వెంకట కిషన్ ఇట్యాల, తహసిల్దార్
( సలహాదారుడు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జగిత్యాల జిల్లా) – 9908198484

