TGEJAC – జూన్ 2 లోపు 2వ పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్

TGO NEWS (APRIL 07) : ​TGEJAC DEMANDING PRC. హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన టీజీఈజేఏసీ (TGEJAC) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, జూన్ 2వ తేదీ లోపు 51 శాతం ఫిట్‌మెంట్‌తో 2వ పీఆర్‌సీని అమలు చేయాలని చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించుకుని జాప్యం లేకుండా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

TGEJAC DEMANDING PRC.

​రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు దాదాపు రూ. 1500 కోట్ల వరకు పేరుకుపోయాయని, వీటిని తక్షణమే విడుదల చేయాలని జేఏసీ నేతలు పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 750 కోట్లు, రెగ్యులర్ ఉద్యోగులకు మరో రూ. 750 కోట్లు ప్రతి నెలా కేటాయించాలని సూచించారు. అలాగే, మే 1వ తేదీ నుండి నగదు రహిత వైద్య సేవలు (EHS) అందేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

​ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించని పక్షంలో దశలవారీగా పోరాటాలు చేస్తామని జేఏసీ ప్రకటించింది. ఈ కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 17న మండల, డివిజన్ కేంద్రాల్లో నిరసనలు, మే 5న అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మే 14న మరోసారి సమావేశమై తదుపరి ఉద్యమ రూపురేఖలను ఖరారు చేస్తామని హెచ్చరించారు.

​ఇతర డిమాండ్లలో భాగంగా 2004 సెప్టెంబర్ కంటే ముందు నియామకమైన వారికి పాత పెన్షన్ విధానాన్ని (OPS) వర్తింపజేయాలని, ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు. అలాగే ఏపీలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ఖమ్మంలో సదస్సు నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు.